దేశభక్తి అంటే…. మన దేశ సంపదనీ, ప్రజల కష్టాన్నీ దోచుకున్న బ్రిటీష్ వారిని తరిమికొట్టి, అంతకన్నా దారుణంగా దేశాన్ని దోచుకుంటన్న మన నాయకులకూ, ప్రజా ప్రతినిధులకూ జై కొట్టడం కాదు.

జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్ గా పెట్టుకోవడమో , కాంగ్రేస్ ప్రభుత్వం ముద్రించిన పాఠ్యపుస్తకాలు చదివి స్వాతంత్ర్యం మొత్తాన్ని ఏ ఒక్కడో తెచ్చాడని అనే భ్రమలో ఉంటూ దేశం కోసం ధన మాన ప్రాణాలను అర్పించిన ఎందరో దేశభక్తుల త్యాగాన్నీ , ఘనతనీ ఏ ఒక్కడికో అంటగట్టడమో కాదు.

దేశభక్తి అంటే… తమ జీవితాలనీ, కుటుంబాలనీ, ప్రాణాలనీ దేశం కోసం అర్పించి , లాఠీదెబ్బలు తింటూ జైలు జీవితాన్ని గడిపి బ్రిటీష్ వారి దౌర్జన్యాలకూ, స్వదేశీ వారి కుట్రలకూ బలై అనామకుల్లా మరణించిన నిజమైన దేశభక్తుల చరిత్రలను గురించి తెలుసుకోవడం, వారిని స్పూర్తిగా తీసుకోవడం.

దేశభక్తి అంటే… ప్రజలను దోచుకుంటున్న దేశద్రోహుల దౌర్జన్యాలను కులాలకూ, మతాలకూ, పార్టీలకూ ప్రాంతాలకూ అతీతంగా ప్రశ్నించడం. మోసం చేస్తున్న నాయకులను నిలదీయడం, నిజాయితీపరులకు మాత్రమే ఓటేసి గెలిపించడం, దేశాన్ని తల్లిలా ప్రేమించడం, సంఘాన్ని తండ్రిలా రక్షించడం, సాటివారికి మంచిని భోధించడం, పక్కవాడికి చేయూత అందించడం, నిజాలను ధైర్యంగా చెప్పడం. మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం వల్ల కానీ మనం పొందిన హక్కుల వల్ల కానీ తోటివారికి నష్టం కలగకుండా ప్రవర్తించడం, శత్రు దేశాలనుంచీ, స్వదేశీ నాయకుల నుంచీ మనల్ని మనం కాపాడుకోవడం.

ఈరోజు జెండా ఎగరేస్తున్న నాయకుల్లో నిజాయితీపరులు ఎంతమంది ? ఏ అవినీతీ చేయనివారు ఎంతమంది? ప్రజలను దోచుకోనివారు ఎంతమంది? దేశాన్ని దోచుకుంటున్నారని తెల్ల దొరలను తరిమికొట్టామని గర్విద్దామా… లేక మన దేశంలో పుట్టి మనల్నే దోచుకుంటున్న ఇలాంటి నాయకులతో జాతీయజెండా ఎగురవేయిస్తున్నామని సిగ్గుపడదామా….?

నిజమైన దేశభక్తుడు ప్రజల సంపదను దోచుకుంటున్న నాయకులను క్షమించడు , అవినీతి నాయకులను భరించడు, జరుగుతున్న మోసాలను సహించడు. తన కుటుంబం వేరు , ఈ దేశం వేరు అని ఊహించడు.

మనల్ని దోచుకుంటున్న నాయకులను మనమే కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో , పార్టీల పేరుతో వెనకేసుకు రాకుండా ఈ రాజకీయ నాయకుల మోసాలనీ అన్యాయలనీ ప్రశ్నించేరోజునే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లని భావిస్తూ…… జెండా ఎగురేసి చాక్లెట్లు పంచుకుని అదే స్వాతంత్ర్యం అనీ, అదే దేశభక్తి అనీ భావించే నా భారతీయ సోదరులందరికీ…. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. జైహింద్….!